కామారెడ్డిలో జర్నలిస్టుల నిరసన.. సమస్యలు పరిష్కరించాలని TUWJ డిమాండ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్‌లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా TUWJ-IJU జిల్లా అధ్యక్షుడు వి. రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి టి. రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం
మీడియా రంగంలో పనిచేస్తున్న విలేకరుల రక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోవడం విచారకరమని నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టులపై శారీరక దాడులు, బెదిరింపులు, అక్రమ కేసుల ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో భద్రత కోసం ప్రత్యేక జాతీయ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
1982 తర్వాత మీడియా రంగంలో చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాను కూడా పరిగణనలోకి తీసుకుని నూతన మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. గతంలో రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
వేజ్ బోర్డు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు
ప్రస్తుతం పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులకు నూతన వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని TUWJ-IJU నాయకులు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులందరికీ ఉచిత, నాణ్యమైన వైద్యం అందేలా క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.
మీడియా స్వేచ్ఛ పరిరక్షణలో, జర్నలిస్టుల ఐక్యతను చాటడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షులు అబిద్, శంకర్‌తో పాటు యూనియన్ నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.