విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ నజర్.. కురవిలో వరుసగా రెండో రోజు తనిఖీలు
కురవి మండలంలో స్కూల్ వాహనాల తనిఖీలు.. పత్రాలు లేని వాటిపై చర్యలు
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, కురవి: బడి పిల్లలను పరిమితికి మించి తరలిస్తున్న ఆటోలు, సరైన పత్రాలు లేని వాహనాలపై మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో రవాణా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు
కురవి మండల కేంద్రంలో వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు.
విద్యార్థులను అధిక సంఖ్యలో ఎక్కించుకుని వెళ్తున్న ఆటోలతో పాటు అవసరమైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నారు. వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ), పర్మిట్, ఇన్సూరెన్స్ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు
పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లిదండ్రులు వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారా? డ్రైవర్‌కు సరైన లైసెన్స్ ఉందా? వాహనానికి అవసరమైన పత్రాలు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలించాలని రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు.
పాఠశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులను తరలించే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, బస్సులకు అవసరమైన పత్రాలను తనిఖీ చేయాలి. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే విద్యార్థుల రవాణా బాధ్యత అప్పగించాలని సూచించారు.
వర్షాకాలంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
వర్షాల సమయంలో కరకట్టలు, చెరువు కట్టలు, బురద రహదారులు, జారుడు మార్గాల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం కారణంగా టైర్లు జారిపోయే అవకాశం ఉండటంతో బడి పిల్లలను తీసుకెళ్లే డ్రైవర్లు వేగాన్ని తగ్గించి, రహదారి పరిస్థితులను గమనిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు.
ఈ తనిఖీల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఎస్. వెంకట్ రెడ్డి, ఖాసీం, సుందర్‌లాల్ పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత కోసం రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
















