కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. సామాజిక భద్రతా పథకాలకు మరో ఐదేళ్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2026–27 నుంచి 2030–31 వరకు మరో ఐదేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అక్టోబర్ 14న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మొత్తం రూ.53,428 కోట్ల కేటాయింపునకు ఆమోదం లభించింది.
పథకాల పేర్లలో మార్పులు
కేంద్ర ప్రభుత్వం NSAP పేరును ‘ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన’గా మార్చనుంది. ఇందులోని పలు పథకాలకు కూడా కొత్త పేర్లు ప్రతిపాదించారు. వృద్ధాప్య పెన్షన్ పథకం ‘ప్రధానమంత్రి వృద్ధావస్థ పెన్షన్ యోజన’గా, వితంతువుల పెన్షన్ పథకం ‘ప్రధానమంత్రి విధవా పెన్షన్ యోజన’గా, దివ్యాంగుల పెన్షన్ పథకం ‘ప్రధానమంత్రి దివ్యాంగజన్ పెన్షన్ యోజన’గా మారనున్నాయి. జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి ‘ప్రధానమంత్రి పరివార్ లాభ్ యోజన’ అనే పేరు నిర్ణయించారు.
దివ్యాంగుల పెన్షన్‌లో కీలక మార్పులు
దివ్యాంగుల పెన్షన్ పథకంలో అర్హత ప్రమాణాలను కేంద్రం సవరించింది. ఇప్పటివరకు ఉన్న 80 శాతం వైకల్యం ప్రమాణాన్ని 40 శాతానికి తగ్గించింది. కనీస వయస్సు పరిమితిని కూడా తొలగించి, పుట్టుక నుంచే అర్హతను పరిగణనలోకి తీసుకునేలా మార్పు చేసింది.
కొత్త నిర్ణయం ప్రకారం 0–79 సంవత్సరాల వయస్సు గల అర్హులైన దివ్యాంగులకు నెలకు రూ.375, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి నెలకు రూ.625 కేంద్ర సహాయం అందించనున్నారు.
వృద్ధులు, వితంతువుల పథకాలు యథాతథం
వృద్ధులు, వితంతువుల పెన్షన్ పథకాలతో పాటు జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని ప్రస్తుత రూపంలో కొనసాగించనున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కేంద్రం వెల్లడించింది.
దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించిన అర్హతలు, లబ్ధిదారుల సంఖ్య, ఆర్థిక సహాయం మొత్తంపై సవరించిన మార్గదర్శకాలను మూడు నెలల్లోగా జారీ చేసి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అధికారిక మూలం: PIB










