ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ, మన్మోహన్ సింగ్, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఎల్లారెడ్డి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామాజిక శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ ముందస్తు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు వారి సేవలను స్మరించుకున్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. తన భూమి కోసం ఆమె సాగించిన పోరాటాన్ని గుర్తుచేశారు.
ఐలమ్మకు సంబంధించిన భూమి కేసులో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆమె తరఫున వాదించి విజయం సాధించారని తెలిపారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను ప్రస్తావిస్తూ, పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భారత ఆర్థిక సంస్కరణల్లో ఆయన అందించిన సేవలను కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర
డాక్టర్ వి. శంకరయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సామాజిక ఉద్యమకారిణి అని తెలిపారు. తన భూమిని దక్కించుకునేందుకు దొరలతో పోరాడిన ఆమె తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ ఆకాంక్షలను కొండా లక్ష్మణ్ బాపూజీ బలంగా వినిపించారని పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో విశేష సేవలు అందించారని, భారతీయ రిజర్వు బ్యాంకులోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారని శంకరయ్య తెలిపారు.
మన్మోహన్ సింగ్ విద్యాభ్యాసం, ఆర్థిక సేవలపై అవగాహన
కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ విద్యాభ్యాసం, వృత్తి జీవితం, దేశానికి అందించిన సేవలను వివరించారు.
మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారని, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారని తెలిపారు. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా, ప్రణాళిక సంఘంలోనూ ఆయన సేవలందించారని వివరించారు. 1987లో భారత ప్రభుత్వం మన్మోహన్ సింగ్‌ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు.
ఉత్సాహంగా పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ వి. శంకరయ్య, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ శివకుమార్, సైన్స్ ఇన్‌చార్జి డాక్టర్ బుద్దె అరుణ్ కుమార్, అర్థశాస్త్ర అధ్యాపకుడు కృష్ణప్రసాద్, రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
అలాగే అధ్యాపకులు డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్ధు రాజు, రాణి, చంద్రకాంత్, సంతోష్, శశిధర్, రాజు, సురేష్ రెడ్డి, సంగీత, స్వప్న, మహమూద్, నరేష్, పవన్‌తో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.