ఆర్సీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే హెల్మెట్.. అల్వాల్‌లో కొత్త సదుపాయం
కొత్త హెల్మెట్ కొనేవరకు ఉచితంగా వినియోగం.. అల్వాల్ ట్రాఫిక్ పోలీసుల ఏర్పాటు
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, అల్వాల్: ద్విచక్ర వాహనదారులు కొత్త హెల్మెట్ కొనుగోలు చేసే వరకు భద్రత కోసం హెల్మెట్ వినియోగించుకునేలా అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందిరా గాంధీ కూడలిలో హెల్మెట్ బ్యాంకును ప్రారంభించి, 150 హెల్మెట్లను అందుబాటులో ఉంచారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ చొరవతో అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ బ్యాంకును ప్రారంభించారు. అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు, వ్యాల్యూ గోల్డ్ సంస్థ సహకారంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
హెల్మెట్ తీసుకునే విధానం
హెల్మెట్ అవసరమైన ద్విచక్ర వాహనదారులు తమ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ను భద్రతగా ఇచ్చి హెల్మెట్ తీసుకెళ్లవచ్చని ఏసీపీ శంకర్ రాజు తెలిపారు. కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి హెల్మెట్ బ్యాంకుకు అప్పగించాలని సూచించారు.
అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై ప్రాణనష్టం జరగకుండా ఉండాలంటే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
150 హెల్మెట్ల విరాళం
ఈ హెల్మెట్ బ్యాంకు ఏర్పాటుకు వ్యాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 150 హెల్మెట్లను విరాళంగా అందించింది. సంస్థ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ప్రతినిధి అంజని, ప్రతినిధి నితిన్ ఈ సహకారం అందించారు. హెల్మెట్ల విరాళానికి అల్వాల్ ట్రాఫిక్ సీఐ జి. పవన్ కుమార్ రెడ్డి సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ ట్రాఫిక్ సీఐ జి. పవన్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ జానకి రాములు, బేగంపేట ట్రాఫిక్ సీఐ కె. శ్రీనివాసులు, అడిషనల్ ఇన్స్పెక్టర్ డి. ప్రమోద్ కుమార్, తిరుమలగిరి ట్రాఫిక్ సీఐ సర్దార్ నాయక్, అడిషనల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణయ్య, ట్రాఫిక్ సిబ్బంది, వ్యాల్యూ గోల్డ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.










