పవార్ వార్త, నిజామాబాద్: శీతాకాలంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు రహదారులపై పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. అత్యవసరమైతే తప్ప పొగమంచు సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
ఉష్ణోగ్రతలు తగ్గడంతో రహదారులపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని, దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలు, రోడ్డుపై ఉన్న అడ్డంకులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. లైట్లు వెలిగించినా ముందున్న వాహనాలు కనిపించకపోవచ్చని, అలాంటప్పుడు అధిక వేగం ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు. అకస్మాత్తుగా బ్రేకు వేస్తే వాహనాలు అదుపు తప్పి బోల్తా పడటం, ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడం వంటివి జరగవచ్చని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
పోలీసులు సూచించిన జాగ్రత్తలు
- అత్యవసరమైతే తప్ప దట్టమైన పొగమంచు సమయంలో ప్రయాణం వద్దు.
- తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే వేగం బాగా తగ్గించి నెమ్మదిగా నడపాలి.
- లో-బీమ్ హెడ్‌లైట్లు వాడాలి, అవసరమైతే ఫాగ్ లైట్లు ఉపయోగించాలి.
- హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఇండికేటర్లు పనిచేస్తున్నాయో ముందే చూసుకోవాలి.
- ప్రతి వాహనానికి ముందు, వెనుక రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండాలి.
- ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించాలి; అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, ఓవర్‌టేక్ చేయడం చేయకూడదు.
- ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్, కారు వంటి నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలి.
- డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వాడకూడదు; అలసటగా ఉంటే ప్రయాణం చేయకూడదు.
రోడ్డు కనిపించనంత పొగమంచు ఉంటే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి, పరిస్థితులు అనుకూలించిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలని కమిషనర్ సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, వాహనదారులు తమ ప్రాణాలకే కాకుండా రహదారిపై ఇతరుల ప్రాణాలకూ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.













