బాన్సువాడలో రూ.56 లక్షల విలువైన చోరీ కేసు ఛేదింపు.. ఇద్దరు అరెస్ట్
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కేసు వివరాలను వెల్లడించారు.
తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ
సెప్టెంబర్ 27, 2026న బాన్సువాడ గౌలిగూడ కాలనీకి చెందిన చింతల భాస్కర్ తన ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బెడ్రూంలోని లాకర్‌లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఇన్వర్టర్ చోరీకి గురైనట్లు గుర్తించారు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో గుర్తింపు
సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 2న బొగ్గుగుడిసె చౌరస్తా సమీపంలో దొంగిలించిన సొత్తును హైదరాబాద్‌లో అమ్మేందుకు వెళ్తుండగా ఇద్దరిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరూ బంధువులే
అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు బంధువులని పోలీసులు తెలిపారు. వారిలో A1గా ఉన్న దండుగుల మైసయ్య @ మణికంఠ (25) బాధితుడి ఇంటి పక్కనే నివసిస్తాడని పేర్కొన్నారు. అప్పులు తీర్చేందుకు చోరీకి ప్రణాళిక వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
నిందితుల నుంచి 31.2 తులాల బంగారం, 3 కిలోల వెండి, నగదు, బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మైసయ్యపై ఇప్పటికే 6 చోరీ కేసులు
అరెస్ట్ అయిన వారిని దండుగుల మైసయ్య @ మణికంఠ (25), దండుగుల ఎల్లయ్య @ రాజు (20)గా పోలీసులు గుర్తించారు. మైసయ్యపై ఇప్పటికే ఆరు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులను బిచ్కుంద కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
కేసును ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ, టౌన్ SHO శ్రీధర్, CCS ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, SI శిరీషతో పాటు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.