చందుపట్లలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి
గ్రామసభలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల డిమాండ్
బీబీపేట, అక్టోబర్ 2: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం చందుపట్ల గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో గ్రామ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గత ఏడాది బ్రిడ్జి దెబ్బతినడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. దెబ్బతిన్న బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పార్టీలకు అతీతంగా చర్యలు చేపట్టాలని, అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ భర్త కొరివి నర్సింహులు మాట్లాడుతూ.. చిన్నచిన్న పనులకు పరిమితం కాకుండా దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. గ్రామంలోని బ్రిడ్జి సమస్యతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గ్రామసభలో అభివృద్ధి పనులపై కొంతసేపు వాడివేడిగా చర్చ జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఏ పని చేపట్టినా కేవలం తీర్మానాలకే పరిమితం కాకుండా, వాటిని ఆచరణలో చూపించాలని ప్రజాప్రతినిధులను కోరారు.
బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు అందకపోతే గ్రామస్థులంతా కలిసి అవసరమైన సహకారం అందించాలని కొరివి నర్సింహులు సూచించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అవసరమైతే గ్రామస్థుల సహకారంతో డీసీఎం వాహనాల్లో వెళ్లి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, మాజీ సర్పంచ్ భూమ గౌడ్, తాజా సర్పంచ్ సత్యనారాయణ, ఉమ్మడి సర్పంచ్ గాడ్లింగం సుతార్ రమేష్, మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త నర్సింహులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.