బోయినపల్లి, అక్టోబర్ 17: జవహర్ నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేసి, పర్యావరణ పునరుద్ధరణ చేపట్టాలని కోరుతూ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ (జేఏసీ) నేతలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. శనివారం బోయినపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

జవహర్ నగర్ డంపింగ్ యార్డు కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల కలుషితం, గాలి కాలుష్యం, దుర్వాసన, మీథేన్ వాయువు విడుదల వంటి సమస్యలను ప్రస్తావించారు. వీటి ప్రభావంతో ప్రజలు శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కును పరిరక్షించే బాధ్యతలో భాగంగా ప్రభుత్వంతో, సంబంధిత అధికారులతో చర్చించి డంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. కాలుష్య నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని, ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సేవలు, పరిశుభ్రమైన తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయ పద్ధతుల్లో పర్యావరణ పునరుద్ధరణ చేపట్టాలని కూడా కోరారు.

ఈ వినతిపత్రాన్ని జేఏసీ చైర్మన్, ఐఎఫ్‌టీయూ నేత షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్‌తో పాటు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు అందజేశారు. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ సంస్థలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాలకు చెందిన మెజారిటీ ప్రజలు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడే సమస్య పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని జేఏసీ నేతలకు సూచించినట్లు సమాచారం. కేవలం వినతిపత్రాలు, అర్జీలతో సమస్య పరిష్కారం కాదని, ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి