నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్లు ప్యాకెట్లపై ఎక్స్పైరీ తేదీ, తయారీ తేదీ, పదార్థాల వివరాలు, ఆల్కహాల్ శాతం, ఆరోగ్య హెచ్చరిక వంటి సమాచారాన్ని తప్పనిసరిగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా RSP జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని కల్లు డిపోలు, జిల్లా కేంద్రంలోని కల్లు విక్రయ కేంద్రాల నుంచి సరఫరా చేస్తున్న కల్లు ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ, ఉపయోగించిన పదార్థాల పూర్తి వివరాలు, ఆల్కహాల్ శాతం వంటి సమాచారాన్ని ముద్రించడం లేదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
దీంతో వినియోగదారులు తాము తీసుకుంటున్న పానీయంలో ఆల్కహాల్ శాతం ఎంత, చక్కెర శాతం ఎంత అనే వివరాలను తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్యాకెట్లలోని కల్లు సహజసిద్ధంగా తాటి లేదా ఈత చెట్ల నుంచి సేకరించిందా, లేక కృత్రిమంగా తయారు చేసిందా అనే విషయం కూడా వినియోగదారులకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కల్లు ప్యాకెట్లపై ఆరోగ్య హెచ్చరికను కూడా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని RSP నాయకులు కోరారు. వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పదార్థాల వివరాలు, ఆల్కహాల్ శాతం, తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీతో పాటు ఆరోగ్య హెచ్చరికను కూడా తప్పనిసరిగా ముద్రించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా జిల్లాలోని కల్లు డిపోల నుంచి నమూనాలు సేకరించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో RSP నాయకులు పీట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్, సుర్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

















