కామారెడ్డి జిల్లాలో 52 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసులు ఛేదించిన పోలీసులు
కామారెడ్డి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించిన అంతర్ జిల్లా ముఠా కేసును పోలీసులు ఛేదించారు. గత ఐదు నెలలుగా భిక్కనూర్, రాజంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ట్రాన్స్‌ఫార్మర్ చోరీలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం 52 చోరీ కేసులను ఛేదించినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఈ వివరాలను వెల్లడించారు. అసిస్టెంట్ ఇంజనీర్ బాలాజీ, లైన్‌మెన్ ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బల్బీర్ సింగ్, రూప్ సింగ్, లక్కీ సింగ్‌లను నిందితులుగా గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. వీరు ముగ్గురూ సొంత అన్నదమ్ములని తెలిపారు.
పోలీసుల ప్రకారం.. నిందితులు పగటిపూట ట్రాన్స్‌ఫార్మర్లను రెక్కీ చేసి, రాత్రివేళ చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్‌ను వేరు చేసి విక్రయించేవారని, ఆ డబ్బును జల్సాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వినియోగించేవారని ఎస్పీ తెలిపారు.
నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వారి వ్యవహారశైలిలో మార్పు రాలేదని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో కామారెడ్డి జిల్లాలో 29, మెదక్ జిల్లాలో 23.. మొత్తం 52 ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
అదే దర్యాప్తులో ఒక హత్యాయత్నం, ఒక ఇంటి దొంగతనం కేసును కూడా ఛేదించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
నిందితుల నుంచి 30 కిలోల కాపర్ వైర్, యమహా బైక్‌తో పాటు చోరీలకు ఉపయోగించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
కేసును ఛేదించిన డీఎస్పీ మధుసూదన్, సీఐలు నరేష్, సంతోష్ కుమార్, ఎస్‌ఐలు అనిల్, మహేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.