లక్ష్మీనారాయణ చెరువును డంపింగ్ యార్డు వ్యర్థాల నుంచి రక్షించాలి: బీజేపీ
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్‌లో ఉన్న లక్ష్మీనారాయణ చెరువు డంపింగ్ యార్డు వ్యర్థాలతో కలుషితమవుతోందని ఆరోపిస్తూ, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీజేపీ ప్రతినిధుల బృందం హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, ఘట్‌కేసర్ మండల మాజీ MPP ఏనుగు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఈ బృందం హైడ్రా కమిషనర్‌ను కలిసింది. జిల్లా మీడియా కన్వీనర్ చలవాడి ప్రవీణ్ రావు తదితరులు ఈ అంశంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే డంపింగ్ యార్డు నుంచి వస్తున్న చెత్త, మురుగునీరు, రసాయన వ్యర్థాలు నేరుగా లక్ష్మీనారాయణ చెరువులోకి చేరుతున్నాయని ఆరోపించారు. కలుషిత నీటి కారణంగా పంట పొలాలు నష్టపోతున్నాయని, రైతులు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.
పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసన, దోమల బెడదతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, డంపింగ్ వ్యర్థాలు చెరువులోకి రాకుండా ప్రహరీ గోడ నిర్మించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని డిమాండ్ చేశారు.
చెరువు పరివాహక ప్రాంతంలో కబ్జాలపై చర్యలు: హైడ్రా కమిషనర్
బీజేపీ ప్రతినిధుల బృందం సమర్పించిన వినతిపై హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. చెరువు పరివాహక ప్రాంతంలో కబ్జాలకు గురైన స్థలాలను త్వరలో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అలాగే చెరువులోకి చేరుతున్న కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు అధునాతన STP (Sewage Treatment Plants), ETP (Effluent Treatment Plants) ఏర్పాటు చేసేలా సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపినట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన అనంతరం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ సానుకూల స్పందనపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్. మల్లేష్ ముదిరాజ్, పి. హరికృష్ణ, బి. కృష్ణ, టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.