బోధన్, అక్టోబర్ 6, 2026 (పవార్ వార్త): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బోధన్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ షర్బత్ కెనాల్, అంబేద్కర్ చౌరస్తా, రైల్వే గేట్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రంతో పాటు ప్రజల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు ఎం. నరేందర్, జిల్లా సీనియర్ నాయకుడు కే. గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ చేయూత పింఛన్లు అందించాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమవుతున్నాయని వారు విమర్శించారు. పెరుగుతున్న ధరలను అరికట్టాలని, రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ సరఫరా చేయాలని, రైతుల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వాలు గురికావాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర పాలకులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
డివిజన్ కార్యదర్శి డి. రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు ఐదేళ్లకు ఒకసారి కూడా పెరగకపోవడం, పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో కుటుంబాల మనుగడ కష్టంగా మారుతోందని అన్నారు.
ప్రజలు, కార్మికులపై పన్నుల భారాలు పెంచుతూ దేశ సంపదను కొంతమంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మళ్లించే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని వారు ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. సీతారాం, ఓడ్డెన్న, ఎస్.కే. నజీర్, జి. రాములు, దేవయ్య, బి. సాయిలు, గంగారాం, సలీం, మోహన్, డి. నాగేశ్వర్, నరేష్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


