ఎల్లారెడ్డిలో ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాతినిధ్యం ఏదీ?: డా. బట్టు విఠల్ ప్రశ్న
ఎల్లారెడ్డి: ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినా, పదవుల పంపిణీలో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డా. బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గంలో రాజకీయ అసంతృప్తి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో డా. బట్టు విఠల్ మాట్లాడుతూ.. జనాభా పరంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, నాయకులు మారినా కీలక పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో పరిస్థితి ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికలు సమీపించినప్పుడు ముదిరాజ్‌లను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తున్నా, ఎన్నికల అనంతరం అదే స్థాయిలో రాజకీయ అవకాశాలు, నిర్ణయాత్మక బాధ్యతలు దక్కడం లేదని ఆయన ఆరోపించారు. కొందరికి చిన్నపాటి పార్టీ పదవులు ఇచ్చి మొత్తం సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం లభించినట్లు భావించకూడదని విమర్శించారు.
ముదిరాజ్ నాయకత్వాన్ని విస్తృతంగా ప్రోత్సహించి కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని డా. బట్టు విఠల్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ముదిరాజ్ జాతి తగిన రీతిలో స్పందించాలని ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
‘పదవులు దయతో కాదు.. ప్రాతినిధ్యం హక్కుగా కావాలి’
ముదిరాజ్ నాయకులు, ముఖ్యంగా యువత తమ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యంపై గట్టిగా, వ్యూహాత్మకంగా స్పందించాల్సిన సమయం వచ్చిందని డా. బట్టు విఠల్ పిలుపునిచ్చారు.
పదవుల కోసం అడుగులకు మడుగులొత్తే ధోరణికి స్వస్తి పలికి, తమ సామాజిక, రాజకీయ వాటాగా రావాల్సిన ప్రాతినిధ్యంపై అధికార పార్టీ నేతలతో చర్చించడం, ప్రశ్నించే చైతన్యం పెంచుకోవాలని సూచించారు. సరైన గుర్తింపు లేని చోట కొనసాగడం తమ సామాజిక వర్గం నాయకుల స్వభావం కాదని, సరైన సమయంలో సరైన సమాధానం ఇవ్వడం తమకు తెలుసని పేర్కొన్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గంలో ఐక్యత, సమన్వయం పెరిగితే రాజకీయ ప్రాధాన్యంపై మరింత విస్తృతమైన చర్చ జరుగుతుందని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో కనిపించే ఓటు బ్యాంకుగా కాకుండా పార్టీ, పాలనా వ్యవస్థల్లో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో తగిన ప్రాతినిధ్యం ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు.
ఫామ్‌హౌస్‌లో ముఖ్య నాయకుల భేటీ జరిగినట్లు వెల్లడి
ఇటీవల ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో మండలాల వారీగా ముదిరాజ్ జనాభా వివరాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ముదిరాజ్ ఓట్లు ఉన్నాయని సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే పదవుల పంపిణీ, పార్టీ నామినేటెడ్ పోస్టుల విషయంలో తగిన గుర్తింపు లభించడం లేదని, దీంతో అధికార పార్టీకి చెందిన ముదిరాజ్ నేతల్లో నిరాశ నెలకొందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
తమ సామాజిక వర్గానికి రావాల్సిన వాటా కోసం ప్రత్యక్షంగా జిల్లా నాయకత్వం రంగంలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలిసిందని తెలిపారు.
‘మేమెంతో.. మాకంత’ అంటూ ప్రాతినిధ్యం కోసం డిమాండ్
ముదిరాజ్ సామాజిక వర్గానికి కీలకమైన పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో తగిన అవకాశాలు దక్కడం లేదని డా. బట్టు విఠల్ విమర్శించారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్న ముదిరాజ్ నాయకులు తమ ప్రాతినిధ్యం కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
ముదిరాజ్‌లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, యువత, మహిళలు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తున్నారని, అధికార, పార్టీ పదవుల పంపిణీలో ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ప్రశ్నించారు.
కావాలనే రాజకీయ దురుద్దేశంతో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఎదగకుండా చేస్తున్న నాయకుల తీరుపై ఆయన విమర్శలు చేశారు. ‘మేమెంతో.. మాకంత’ అనే ప్రశ్నకు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశంపై త్వరలో నియోజకవర్గాల వారీగా రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని జిల్లా కార్యవర్గం తీర్మానించినట్లు డా. బట్టు విఠల్ తెలిపారు.
ముదిరాజ్ సమాజానికి దిశానిర్దేశం చేసిన కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, పండుగల సాయన్న ముదిరాజ్, కేవల్ కిషన్ ముదిరాజ్, నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ వంటి ప్రముఖుల ప్రస్థానం, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగం, సామాజిక చైతన్యం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు.
రాజకీయ ప్రాతినిధ్యంపై పునరాలోచన చేయాలని డిమాండ్
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గం రాజకీయ ప్రాతినిధ్యంపై మరింత విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉందని డా. బట్టు విఠల్ అన్నారు.
ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను సమీక్షించుకుని, భవిష్యత్తులో ముదిరాజ్ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించే అంశాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా పరిగణించాలని కోరారు. సామాజిక ప్రాతినిధ్యం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించి హక్కుల కోసం కృషి చేయాలని, ఓట్ల సమయంలో మాత్రమే కాకుండా రాజకీయ నిర్ణయాల్లోనూ ముదిరాజ్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం ఉండాలని డా. బట్టు విఠల్ ముదిరాజ్ పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.