కీసరలో ఏసీబీ ట్రాప్ తర్వాత.. లారీ యజమాని ఎస్‌ఐపై రూ.50 వేల లంచం ఆరోపణలు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఏసీబీ ట్రాప్‌లో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కీసర పోలీసుల తీరుపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఓ లారీని విడుదల చేసేందుకు ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని లారీ యజమాని ఆరోపించారు.
ఔటర్ రింగ్‌రోడ్డుపై టిప్పర్ లారీ కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటనలో కీసర ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి లారీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని లారీ యజమాని తెలిపారు.
లారీని సీజ్ చేసి 15 రోజులు గడిచినా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని ఆయన ఆరోపించారు. లారీ విడుదల కోసం ఎస్‌ఐ రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే లారీ బయటకు రాదని చెప్పినట్లు బాధితుడు వాపోయారు.
“రూ.50 వేలు ఇవ్వకపోతే లారీ కింద గడ్డి మొలుస్తుంది” అంటూ హెచ్చరించారని లారీ యజమాని ఆరోపించారు.
లారీ కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, తప్పు లేకున్నా లంచం అడగడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు భయపడి ఇంకా చాలామంది బాధితులు బయటకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని లారీ యజమాని కోరుతున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.