లింగంపేట హత్య కేసు ఛేదన: నిందితుడి అరెస్ట్, ఇనుప రాడ్, సెల్‌ఫోన్ స్వాధీనం
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొరుపోలు గ్రామానికి చెందిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, ఒక ఒప్పో సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదురాలు చింతకుంట చంద్రవ్వ, భర్త హనుమంతు లింగంపేట మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందినవారు. ఫిర్యాదురాలి కుమార్తె గత 10 సంవత్సరాలుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్యతో సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది.
హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ వద్ద ఉన్న సమయంలో సాయిలు తన గ్రామానికి రావాలని బలవంతం చేస్తూ, రాకపోతే చంపేస్తానని పలుమార్లు ఫోన్‌లో బెదిరించినట్లు ఫిర్యాదురాలు తెలిపింది. ఈ క్రమంలో 18.09.2026న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి ఆమె కుమార్తె గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరింది.
అనంతరం నాగారం గ్రామ శివారులో తలకు బలమైన గాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందడంతో ఫిర్యాదురాలు లింగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ వై. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తు చేపట్టగా నిందితుడు గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్య, వయస్సు 48 సంవత్సరాలు, కొరుపోలు గ్రామం, లింగంపేట మండలాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, 19.09.2026 ఉదయం సుమారు 11.00 గంటలకు భూమి డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లి జుబేర్‌తో మాట్లాడించాడు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు సాయంత్రం సుమారు 5.00 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి, లింగంపేట ఎస్సై పి. దీపక్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వై. రాజేష్ చంద్ర అభినందించారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉందని, దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.