ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వేగం పెంచాలి.. అర్హులైన వారికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
మహబూబాబాద్, సెప్టెంబర్ 17: జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని ఆమె కోరారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పీడీ పురుషోత్తంలతో కలిసి కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలతో పాటు పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలోనూ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రోడ్డు భద్రతపై కూడా కలెక్టర్ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. హౌసింగ్ అసిస్టెంట్ ఇంజినీర్లు, సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లే సమయంలో జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.
“ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ప్రయాణించాలి” అని సూచించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఉద్యోగులకు 22 హెల్మెట్లను పంపిణీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రోడ్డు భద్రతపై అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమను, తమ కుటుంబాన్ని సంరక్షించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అబ్దుల్ హకీమ్, రాజన్న, అసిస్టెంట్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమాచారాన్ని DPRO MHBD కార్యాలయం ప్రెస్ రిలీజ్ రూపంలో జారీ చేసింది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.