ఉస్మానియా లా కాలేజ్ సమస్యలపై కవిత నిలదీత: రూ.వెయ్యి కోట్లు ఏవని ప్రశ్న
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ గణేష్ ఉత్సవాల్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి ఇస్తామన్న వెయ్యి కోట్ల రూపాయలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆమె నిలదీశారు.
లా కాలేజ్ విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పుడు సీఎం ఇటు వైపు కూడా చూడటం లేదు. యూనివర్సిటీలోని లా కాలేజ్ విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి వినాయక చవితి సంబరాలు జరుపుకోవడం కూడా కష్టంగానే ఉన్నా, అనవాయితీ తప్పవద్దని వేడుకలు చేసుకుంటున్నారు” అని పేర్కొన్నారు.
ఐదారు నెలలుగా విద్యార్థులు రోడ్డెక్కి వంటలు చేసుకుంటూ ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని ఆమె అన్నారు. మంత్రి సీతక్క ఈ యూనివర్సిటీ విద్యార్థిని అని, కనీసం ఆమైనా విద్యార్థుల పరిస్థితిని పట్టించుకోవాలని కవిత కోరారు.
దాదాపు పది నెలలుగా విద్యార్థులకు మెస్ సౌకర్యం లేదని, తాగటానికి నీళ్లు లేకపోవడంతో పాటు పాములు విద్యార్థుల రూమ్‌లలోకి వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ డిస్పెన్సరీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకే పనిచేస్తోందని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఆమె తెలిపారు.
ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను తీర్చాలని కవిత డిమాండ్ చేశారు. లా కాలేజ్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన మద్దతు తెలుపుతోందని, అవసరమైతే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.