తార్నాక, అక్టోబర్ 9 (పవార్ వార్త): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, అధ్యాపకులు, విద్యార్థినుల ఆటపాటలతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
పూల బతుకమ్మలతో సందడి
ఈ వేడుకల్లో అధ్యాపకులు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబీ తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. వాటి చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. ఆటపాటల మధ్య ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సంప్రదాయాలను భావితరాలకు అందించాలి


ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని దైవంగా భావించి పూజించే అరుదైన సంప్రదాయం తెలంగాణలో ఉందని తెలిపారు.
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు తమ ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.
కళాశాల సిబ్బంది, విద్యార్థినుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వాణి, ఇందిర, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను చాటిచెప్పారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


