ఈసీఐఎల్, అక్టోబర్ 9 (పవార్ వార్త): చేగువేరా విప్లవ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ కార్యవర్గ సభ్యుడు కల్లూరు ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖరరెడ్డి భవన్‌లో చేగువేరా 59వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ చేగువేరా ఆశయాలను, విప్లవ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అన్యాయంపై పోరాడి, ప్రజలను సంఘటితం చేసి హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదం, దోపిడీ, అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, విద్యా, వైద్య రంగాల్లో పెరుగుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి, నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు. యువత ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా మారి, వాటి పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించాలని అన్నారు. చేగువేరా జీవితం అణగారిన ప్రజల విముక్తి కోసం సాగిన అంతర్జాతీయ పోరాటానికి ప్రతీక అని పేర్కొన్నారు.
ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ భగత్ సింగ్, చేగువేరా వంటి విప్లవకారుల త్యాగాలు యువతలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం, సమానత్వ భావనను పెంపొందించాలని అన్నారు. విప్లవం కోసం ఎదురుచూడకుండా పోరాడి సాధించుకోవాలనే స్ఫూర్తితో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దోపిడీ, కుల, మత వివక్ష లేని సమాజంతో పాటు ప్రతి ఒక్కరికీ విద్య, ఉపాధి, గౌరవం అందే సమాజ నిర్మాణమే నిజమైన విప్లవ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఉప్పల్ మండల కార్యదర్శి మహేష్ కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గిరిబాబు, రాజు, సుదర్శన్, ప్రతాప్, నరేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


