మేడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్ 10 (ఆర్టీఐ ఎక్స్‌ప్రెస్): భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా గున్న సంధ్య నియమితులయ్యారు. ఈ మేరకు సమితి నిర్వాహకులు రాష్ట్ర కార్యాలయంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆర్టీఐ ఎక్స్‌ప్రెస్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి మహంకాళి బిక్షపతి వెల్లడించారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తా: గున్న సంధ్య
ఈ సందర్భంగా గున్న సంధ్య మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రజాస్వామ్య సమాజానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అంబేద్కర్‌ను గౌరవించాలని పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతి, సామాజిక న్యాయమే లక్ష్యం
చదువు, సామాజిక న్యాయం, కులరహిత సమాజ నిర్మాణం అంబేద్కర్ ఆశయాల్లో ముఖ్యమైనవని గున్న సంధ్య తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషిని గుర్తుచేశారు. ముఖ్యంగా మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆయన పోషించిన పాత్రను ప్రస్తావించారు.
ప్రజల్లో అంబేద్కర్ భావజాలంపై అవగాహన కల్పించేందుకు మహంకాళి బిక్షు నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమాలు తనను ప్రభావితం చేశాయని తెలిపారు. అంబేద్కర్ భావజాల ప్రచారం కోసం తన వంతు కర్తవ్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మంద ఆనంద్, అబ్బగోని నాగరాజు, మేడ స్వామి, గడిపే సునీల్, గడ్డం గిరి, జడల కిట్టు, నవీన్, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


