ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనలు పాటించని వివిధ ఆహార వ్యాపార సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నమోదైన 11 కేసులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సమక్షంలో పరిష్కరించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సి.హెచ్. లోకేష్ ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకుని, మొత్తం రూ.2,90,000 జరిమానా విధించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వాటిలో రమేష్ ధాబాకు రూ.1,00,000, హవేలీకి రూ.75,000, రిలయన్స్ రిటైల్‌కు రూ.50,000, డిలైట్ మండీకి రూ.20,000, జాజూ సంస్థకు రూ.20,000 చొప్పున జరిమానా ఖరారు చేశారు. మిగిలిన కేసుల్లో ఇతర సంస్థలపై తదనుగుణంగా జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆహార వ్యాపార సంస్థలన్నీ తూచా తప్పకుండా పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను బేఖాతరు చేసే వారిపై ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని సహించేది లేదని స్పష్టం చేశారు.

సామాన్య ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండేలా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, నమూనాల సేకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సి.హెచ్. లోకేష్ తెలిపారు. వ్యాపార సంస్థలన్నీ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని ఆయన సూచించారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి