ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై కవిత ఆగ్రహం: బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటన
ఆదిలాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చిన్నారుల మృతి ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యమే తమను ఎక్కువగా బాధించిందని ఆమె అన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ప్రమాదం మానవతప్పిదమేనని కవిత పేర్కొన్నారు. ముగ్గురు చిన్నారులు చనిపోతే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పైసా సాయం చేయలేదని ఆమె ఆరోపించారు. ఫోటోలు దిగేందుకే హెల్త్ మినిస్టర్ ఘటన స్థలానికి వెళ్లారే తప్ప కనీస మానవత్వం ప్రదర్శించలేదని ఆమె విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తాను రేపు ఆదిలాబాద్ వెళ్తానని కవిత తెలిపారు.
ఆదిలాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఇంక్యుబేటర్‌లో ప్రమాదం జరిగితే తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకున్నారని ఆమె తెలిపారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు చనిపోయారని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటన హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని తెలుస్తోందని, ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారని ఆమె అన్నారు. అంటే ఇది మానవతప్పిదం కారణంగా జరిగిందేనని ఆమె పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందుతుందని భావిస్తామని, కానీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బాధితులకు సాయం చేయలేదని కవిత ఆరోపించారు. ప్రభుత్వ హాస్పిటల్‌కు పేదలే వెళ్తారని, చనిపోయిన పిల్లల్లో ఇద్దరు మైనార్టీలు, ఒక ఆదివాసీ బాబు ఉన్నారని ఆమె తెలిపారు. కనీసం వారికి అంత్యక్రియల నిర్వహణకు కూడా సాయం చేయలేదని ఆమె విమర్శించారు.
రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ఆదివాసీ జిల్లా అయిన ఆదిలాబాద్‌కు ఆరోగ్య రంగం విషయంలో ఏమీ చేయలేదని కవిత ఆరోపించారు. వెయ్యి రోజుల తర్వాత వెళ్లిన హెల్త్ మినిస్టర్ అర్ధగంట మాత్రమే అక్కడ ఉన్నారని, హాస్పిటల్ సిబ్బంది కన్నా కూడా ఆయనే ఎక్కువ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె అన్నారు.
హెల్త్ మినిస్టర్ వెళ్తున్నాడంటే బాధితులకు ఏదైనా సాయం చేస్తారని తాము భావించామని, కానీ ఆయన వారికి సాయం చేస్తామని చెప్పలేదని కవిత తెలిపారు. పైగా మంత్రి వస్తున్నాడని అంత్యక్రియలు చేయాల్సిన కార్యక్రమాన్ని ఆపేశారని ఆమె ఆరోపించారు. ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా, ఫోటోలు దిగేందుకు ఈ సంఘటనను వాడుకుంటారా అని ఆమె ప్రశ్నించారు.
కనీసం అంత్యక్రియలు నిర్వహించలేని పేదవాళ్లు వారని, వారికి తమ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు అందజేయనున్నట్లు కవిత ప్రకటించారు. హెల్త్ మినిస్టర్ ఏదో టూరిజం స్పాట్‌కు వెళ్లినట్లు వెళ్లారే తప్ప సంఘటనపై కనీసం రివ్యూ నిర్వహించలేదని ఆమె విమర్శించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఏమీ జరుగుతుందో ముఖ్యమంత్రి ఆడిట్ చేయించాలని కవిత డిమాండ్ చేశారు. ఎంజీఎం హాస్పిటల్‌లో సీలింగ్ కూలిందని, చాలా హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ సరిగా లేదని ఆమె పేర్కొన్నారు. వాటిపై ముఖ్యమంత్రి ఆడిట్ నిర్వహిస్తేనే ప్రజలకు ఒక విశ్వాసం కల్పించినట్లు అవుతుందని ఆమె అన్నారు.
తాము ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, తమ ప్రాధాన్యాల్లో హెల్త్ కూడా ఒకటని కవిత తెలిపారు. రేపు ఆదిలాబాద్ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తామని, వారి బాధల్లో భాగస్వామ్యం అవుతామని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.