చిన్నక్రాంతి కాలనీలో అంబరాన్నంటిన దసరా సంబరాలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పండుగ సందడి
చెంగిచర్ల: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా చెంగిచర్ల డివిజన్ పరిధిలోని చిన్నక్రాంతి కాలనీలో విజయదశమి (దసరా) వేడుకలను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. చిన్నక్రాంతి కాలనీ హౌసింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రత్యేక పూజలు.. ఆధ్యాత్మిక వాతావరణం
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కాలనీ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దుర్గామాత హోమాలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కుటుంబాల్లో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రార్థించారు. పూజా కార్యక్రమాలతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
జమ్మి ఆకుల మార్పిడి.. పెద్దల ఆశీస్సులు
పూజల అనంతరం కాలనీవాసులు ఒకరికొకరు జమ్మి ఆకులను బంగారానికి ప్రతీకగా అందించుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంప్రదాయబద్ధంగా జమ్మి ఆకులను పంచుకుంటూ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పరస్పర ఆప్యాయతలు, సోదరభావం, ఐకమత్యాన్ని చాటుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఐకమత్యంతో కాలనీ అభివృద్ధికి కృషి చేయాలి
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మేడ బాపురాజు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని తెలిపారు. కాలనీవాసులంతా ఐకమత్యంతో, సోదరభావంతో పండుగలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువత, కాలనీవాసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో వేడుకలు
కాలనీ అధ్యక్షుడు మేడ బాపురాజు, కోశాధికారి శివ కుమార్ పటేల్, గౌరవ అధ్యక్షుడు గొరిగే నరసింహ కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ నిలుగొండ వెంకటేష్ గౌడ్‌తో పాటు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు, కమిటీ ప్రతినిధులు, మహిళలు, ఇతర కాలనీవాసులు పాల్గొని దసరా వేడుకలను విజయవంతం చేశారు.

















