కామారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. 106 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతకు ఎంపికైన 106 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించిన షబ్బీర్ అలీ, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదని, పేద కుటుంబాల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని షబ్బీర్ అలీ తెలిపారు. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు హామీలను అమలు చేస్తోందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
సంక్షేమంతో పాటు రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని షబ్బీర్ అలీ అన్నారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పట్టణాభివృద్ధి రంగాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, విద్యా సంస్థలు, క్రీడా మైదానాలకు సంబంధించిన అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు. పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, మహిళలకు ఆర్థిక సాధికారత, యువతకు ఉపాధి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని, ఇళ్ల నిర్మాణంలో అధికారులు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప శ్రీనివాస్ ఉమారాణి, వైస్ చైర్మన్ కాసార్ల గోదావరి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, కౌన్సిలర్లు వాజీద్, జావీద్, సావిత్రి, అఖిల, స్వప్న, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, యూనుస్, షేరు, అన్వార్, మన్సూర్, గంగాధర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.