కామారెడ్డి: తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్ అన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైందని గణేష్ నాయక్ పేర్కొన్నారు. నిరంకుశత్వం, అణచివేత, అన్యాయాలకు చరమగీతం పాడిన రోజుగా సెప్టెంబర్ 17ను ఆయన అభివర్ణించారు.
నైజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం చేసిందని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం అనేక మంది పోరాట యోధులు ప్రాణాలర్పించారని గుర్తుచేశారు.
ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సమసమాజం, ఆత్మగౌరవం కోసం రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు పోరాడారని గణేష్ నాయక్ పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
“స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమే అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి” అని గణేష్ నాయక్ అన్నారు.
చరిత్రను విభజనకు కాకుండా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా మలుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.