టీజేఎస్ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
చారిత్రక వాస్తవాల నేపథ్యంలో సెప్టెంబర్ 17ను చూడాలి: కోదండరాం
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు అని అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిన సందర్భాన్ని చారిత్రక వాస్తవాల నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిన విషయాన్ని తిరిగి ప్రజల చర్చలోకి తీసుకొచ్చిందని ఆయన అన్నారు. 1989లో ‘మా తెలంగాణ’ పత్రిక ఆవిష్కరణతో తెలంగాణ చరిత్ర, అస్తిత్వంపై చర్చ ప్రారంభమైందని, 1996లో వరంగల్‌లో జరిగిన సమావేశం తరువాత తెలంగాణ వాదం ప్రజల్లోకి వెళ్లిందని గుర్తు చేశారు.
ప్రజా పోరాటాల పాత్రను విస్మరించలేం
సెప్టెంబర్ 17ను కేవలం సైనిక చర్య ఫలితంగా చూడటం సరికాదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాల పాత్రను విస్మరించలేమని పేర్కొన్నారు.
మతపరమైన కోణంలో ప్రచారం చేస్తూ తెలంగాణలోని గంగా-జమునా తహజీబ్‌కు భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం తగదని ఆయన అన్నారు. ప్రజలు కోరుకున్నది ప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామిక సమాజమని, ఆ లక్ష్యాల సాధన కోసం పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్
రాష్ట్రంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో, కేసీఆర్ కుటుంబం పేర్లతో అక్రమంగా ఉన్నట్లు తేలిన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలేని పేద దళితులకు, తెలంగాణ ఉద్యమకారులకు పంపిణీ చేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ భూములు కొద్దిమంది చేతుల్లో ఉండకుండా సామాజిక న్యాయం కోసం వినియోగించాలన్నారు.
ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాట స్ఫూర్తి కొనసాగాలి
నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి సీమాంధ్ర పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ ఉద్యమం వరకు ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరిగిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.