జూన్‌లోగా ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కాకపోతే మంత్రి రాజీనామా చేయాలి: ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులపై బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శలు చేశారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల విషయంలో అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను అయోమయానికి గురిచేసేలా ఉన్నాయని ఆయన అన్నారు.
ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే దాదాపు ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా పనులు ఇంకా పూర్తి కాలేదని సుదర్శన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్న ప్రాజెక్టులో పనులు ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై సుదర్శన్ రెడ్డి విమర్శలు
అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూడు పిల్లర్ల నిర్మాణానికే నెల రోజుల సమయం పడుతోందని, ఇంకా 92 పిల్లర్లు నిర్మించాల్సి ఉందని చెప్పినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇదే వేగంతో పనులు కొనసాగితే మరో నాలుగైదేళ్లు పట్టే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారని, ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు.
గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రజలకు హామీలు ఇస్తూ కాలయాపన చేస్తున్నాయని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. గతంలో దసరా నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారని, దసరా గడిచిపోయి జూన్ వచ్చినా ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆయన విమర్శించారు.
జూన్‌లోగా పూర్తి చేయాలని డిమాండ్
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ జూన్‌లోగా ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేయడంలో ప్రభుత్వం విఫలమైతే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.
ప్రజలను మరోసారి మాటలతో మభ్యపెట్టకుండా ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని సుదర్శన్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల కార్యదర్శి రమేష్ నాయుడు, సీనియర్ నాయకులు పూలగొని మహేష్ గౌడ్, కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, బీజేవైఎం ఘట్కేసర్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, బాలు యాదవ్, గుండె నరేష్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.